ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

పట్టణంలో గురువారం రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య తన ప్రియుడితో కలిసి అంతమొందించిందని పట్టణ సీఐ దశరథరామారావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. తూర్పువీధికి చెందిన రాజేశ్వరమ్మ కుమారుడు రూపేష్‌ ఏడేళ్ల క్రితం మానసను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న రూపేష్‌ తన భార్యతో కలిసి నరసయ్యగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

మానస కొంతకాలంగా గూడూరు మండలం కొండాగుంటకు చెందిన రవివర్మతో సన్నిహితంగా ఉంటోంది. విషయం తెలియడంతో పలుమార్లు భార్యను రూపేష్‌ మందలించారు. దీంతో భర్తను చంపేందుకు మానస, తన ప్రియుడు రవివర్మతో కలిసి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలో మానస నాలుగు రోజుల క్రితం పుట్టింటికెళ్లింది. గురువారం రాత్రి నిద్రలో ఉన్న రూపేష్‌ తలపై వారు ఇనుప రాడ్‌తో విచక్షణరహితంగా దాడి చేశారు. ఘటనలో రూపేష్‌ మృతి చెందారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ దశరథరామారావు, ఎస్సై సైదులు, తమ సిబ్బంది వెంకటేశ్వర్లు, ఆర్వీరాజుతో కలిసి విచారణ చేపట్టగా.. నిజాలు వెలుగుచూశాయి. దీంతో పట్టణ సమీపంలోని తాళమ్మగుడి ఆర్చి వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు.