కుమారుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

జల్సాలకు అలవాటుపడిన భర్త చోరీలు చేస్తూ తమను మానసిక క్షోభకు గురిచేస్తుండటంతో ఓ భార్య కుమారుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండల పరిధిలోని గౌతపూర్‌లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కుర్వ బాలమణికి కొన్నేళ్ల క్రితం కొడంగల్‌ పట్టణానికి చెందిన కుర్వ మల్లేశం (42)తో వివాహం జరిగింది.

పెళ్లి అనంతరం మల్లేశం స్వగ్రామంలో ఉన్న ఆస్తులను విక్రయించి అత్తగారిల్లు గౌతపూర్‌కు వచ్చాడు. స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా మల్లేశం జల్సాలకు అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పలుచోట్ల చోరీలు చేయడంతో కరన్‌కోట్, కొడంగల్‌ ఠాణాల పరిధిలో అతడిపై కేసులు కూడా నమోదయ్యాయి.

సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన మల్లేశం భార్యను బంగారం ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తిరిగి మధ్యాహ్నం మల్లేశం భార్యను కొట్టడంతో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలోనే మల్లేశం ఇంట్లోంచి బయటకువస్తూ అకస్మాత్తుగా కిందపడ్డాడు. దీంతో భార్య, కుమారుడు (15) కలిసి బండరాళ్లతో ఆయన తలపై తీవ్రంగా మోదడంతో చనిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు సేకరించారు. మల్లేశంతో వేగలేకే హత్య చేసినట్లు భార్య, కొడుకు పోలీసుల ఎదుట అంగీకరించారు. మృతదేహానికి తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.