పిల్లల పుట్టుకను చూడటం అనేది గొప్ప అనుభూతి

సెలబ్రిటీ కపుల్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ముందు వరుసలో ఉంటారు. విరుష్క జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాలనూ తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానుల్లో ఉంటుంది. ఇక ఇటీవల విరాట్‌, అనుష్కలకు పాప జన్మించడంతో తరుచుగా వార్తలో నానుతున్నారు. తొలిసారి తల్లిదండ్రులు అవ్వడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. తాజాగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. కూతురు వామికాను ఎత్తుకున్న అనుష్క ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఫోటోను షేర్‌ చేసిన కోహ్లి.. ‘పిల్లల పుట్టుకను చూడటం అనేది గొప్ప అనుభూతి. మాటల్లో వర్ణించలేని అదో అద్భుతమైన అనుభవం. దాన్ని ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన తరువాత మహిళల నిజమైన బలం, దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు వారి కడుపులో మరో జీవితాన్ని సృష్టించాడు. ఎందుకంటే వారు పురుషుల కంటే బలంగా ఉన్నారు కాబట్టే. నా జీవితంలో ఇది మరిచిపోలేని విషయం. నా కూతురు కూడా ఆమె తల్లిలా ఎదుగుతుందని భావిస్తున్నాను. ప్రపంచంలోని అద్భుతమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’ అని ఎమోషనల్‌ అయ్యారు.

కాగా ఒక యాడ్ షూటింగులో పరిచయమైన విరాట్, అనుష్క తర్వాత ప్రేమికులుగా మారారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఈ జంటను ‘విరుష్క’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. అనుష్క శర్మ, కోహ్లీకి జనవరి 11 న కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను విరాట్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పాపాయి పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించింది. విరాట్-అనుష్క తన కూతురుకు వామికా అని నామకరణం చేశారు.