ప్రాణం తీసిన వివాహేతర బంధం

నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో వివాహిత, యువకుడు పురుగు మందు తాగి ఆదివారం అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం… తాళ్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ యామన శ్రీనివాసరావుకు ఏలూరుకు చెందిన కుసుమ నాగసాయి (30)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. నాగసాయికి ఏలూరుకు చెందిన షేక్‌ నాగూర్‌ (28) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

తాళ్లపాలెం వచ్చిన నాగూర్‌తో కలిసి సమీపంలోని ఒక ఇంట్లో నాగసాయి మాట్లాడుతుండగా భర్త శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చూసి వారిని నిలదీశారు. వీరిద్దరిని ఒక కారులో శెట్టిపేట శ్రీకృష్ణ మొబైల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ షాపు గదిలోకి తీసుకువెళ్లి నిర్బంధించగా అక్కడ నాగసాయి, నాగూర్‌లు పురుగు మందు తాగి అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త శ్రీనివాసరావుతో పాటు అతని కుటుంబ సభ్యులను నిడదవోలు సీఐ కేఏ స్వామి, ఎస్సై జగదీశ్వరరావు విచారిస్తున్నారు.