చెరువులో పడి ఇద్దరి మృతి

ఎడ్లబండి అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో తాత, మనవడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. పరకాల రూరల్‌ సీఐ రమేశ్‌ కుమార్, ఎస్‌ఐ వెంకటకృష్ణ కథనం ప్రకారం.. వరికోల్‌కు చెందిన కానాల సాంబయ్య (46) తన పెద్ద కూతురు కుమారుడు ఆసోల ఆర్తిక్‌ (6) వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు.

మనవ డు ఎడ్లబండి తోలుతుండగా.. తాత వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. వరికోల్, వేములపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లకుంట చెరువు కట్టపై ఎద్దులు బెదరడంతో బండి అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఆర్తిక్‌ నీటిలో పడగా.. వెనకాల వస్తున్న సాంబయ్య మనవడని కాపాడటానికి చెరువులోకి దిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.