నీట మునిగి ప్రాణాలు విడిచిన చిన్నారులు

సరదాగా ఆడుకునేందుకు వాగులోకి దిగిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచారు. అంతవరకు తమ కళ్లముందు ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు విగత జీవులై కనిపించటం స్థానికులను కంటతడిపెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మోతీనగర్‌కు చెందిన సింగిరి యాదగిరి, అలివేలు దంపతులు కొద్దిరోజులుగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కుర్మపల్లి బస్టాప్‌ వద్ద నివాసం ఉంటున్నారు.

వారి కూతుళ్లు స్వాతి (9), ప్రతిష్ట (5) శుక్రవారం ఉదయం తిమ్మాపూర్‌ శివారు రాళ్లవాగు వైపు ఆడుకోవడానికి వెళ్లారు.అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన చిన్నారుల సోదరుడు అభి తండ్రి యాదగిరికి ఈ విషయం చెప్పాడు. దీంతో యాదగిరి బంధువులతో కలసి వాగు వద్దకు వెళ్లి వెతుకుతుండగా.. స్వాతి, ప్రతిష్ట నీటిలో విగతజీవులుగా కనిపించారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఉంగరాలు అమ్ముతూ.. దొరికిన కూలీ పని చేస్తూ యాదగిరి కుటుంబం జీవనం సాగిస్తోంది. స్థానిక ఎస్సై రవిప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను యాదగిరి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.