బెంగళూరులో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థి మోక్షజ్ఞ రెడ్డి (20) కాలేజీ హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై బెంగళూరు వర్తూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు.. యువకుడు మైదుకూరు పట్టణవాసి. వర్తూరు సమీపంలోని గుంజూరులో ఉన్న ప్రైవేటు కాలేజీలో బీబీఏ చదువుతున్నాడు. శనివారం నుంచి తల్లిదండ్రులకు ఆ యువకుడు ఫోన్‌ చేయలేదు.

దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బెంగళూరులో ఉన్న స్నేహితులకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. వారు వెంటనే హాస్టల్‌ గది వద్దకు వెళ్లి తలుపు తీయగా మోక్షజ్ఞ ఉరివేసుకుని కనిపించాడు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం వైదేహి ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుని మరణంపై అనుమానం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి నిజానిజాలు బయటికి తీయాలని డిమాండ్‌ చేశారు.