లారీ ఎక్కించి ఎస్‌ఐ హత్య

తాగిన మత్తులో ఓ మెకానిక్‌ మినీ లారీ ఎక్కించి ఎస్‌ఐను హత్య చేశాడు. తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీవైంకుఠం సమీపంలోని వాగై కులానికి చెందిన బాలు(50) ఎరల్‌ పోలీసుస్టేషన్‌లో స్పెషల్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వాలా వల్లన్‌ మార్గంలో వాహన తనికీలు చేస్తున్నారు. అటువైపుగా వచ్చిన ఓ మినీ లారీని ఆపారు. వలావల్లన్‌ గ్రామానికి చెందిన మురుగ వేల్‌(39) తాగి రావడంతో వాహనాన్ని సీజ్‌ చేశారు. తనిఖీలు ముగించుకుని అర్ధరాత్రి 1.30 గంటలకు కానిస్టేబుల్‌ పొన్‌ సుబ్బయ్యతో కలిసి బాలు ఇంటికి బైక్‌పై వెళుతున్నారు.

తన వాహనాన్ని సీజ్‌ చేశారన్న ఆగ్రహంతో ఉన్న బాలు తన మెకానిక్‌ షెడ్‌లో ఉన్న మరో మినీ లారీతో బైక్‌ను ఢీకొట్టాడు. కిందపడిన వారిపై వాహనాన్ని ఎక్కించాడు. ఎస్‌ఐ అక్కడికక్కడే మృతి చెందగా.. కానిస్టేబుల్‌ సుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్పీ జయకుమార్‌ అదే రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మురగవేల్‌ ఓ న్యాయవాది ద్వారా విలాతి కుళం కోర్టులో లొంగిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐను లారీ ఎక్కించి హతమార్చిన ఘటనను సీఎం పళనిస్వామి తీవ్రంగా పరిగణించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే రూ. 50 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.