చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి ఆత్మహత్య

చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. వసంతపురి కాలనీకి చెందిన కారింగుల విజయ్‌కుమార్‌ కారు డ్రైవర్‌. ఇతని పెద్ద కుమారుడు అర్జున్‌కుమార్‌(14) స్ధానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చదువుపై ఇష్టం లేకపోవడంతో పలుమార్లు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేవాడు.

ఈ నెల 6 వ తేదీ ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీలో ఉన్న విజయ్‌కుమార్‌కు ఫోన్‌చేసిన అర్జున్‌ సోదరి మీనాక్షి తమ్ముడు బాత్‌రూమ్‌లో టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది.కాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారి సహకారంతో అర్జున్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.