హేళన చేసారని విద్యార్థి ఆత్మహత్య

ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కొత్తగడికి చెందిన సన్‌వెల్లి శంకరయ్య, చంద్రకళ దంపతులకు కుమారులు అరుణ్, మహేందర్‌(17) ఉన్నారు. నెల రోజుల క్రితం శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి చంద్రకళ కూలీపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. మహేందర్‌ కొత్తగడిలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వయసు ఎక్కువగా ఉండటంతో ఓపెన్‌లో టెన్త్‌ ఫీజు కడతానని ఇంట్లో చెప్పగా వద్దని వారించారు.

అయితే సోమవారం తల్లి చంద్రకళ, అన్న అరుణ్‌లు పని నిమిత్తం వికారాబాద్‌కు వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. స్థానికుల సాయంతో తలుపులు తీసి చూడగా మహేందర్‌ దూలానికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందికి దించి వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వయసులో తమ కంటే పెద్దవాడివంటూ తరచూ తోటి విద్యార్థులంతా మహేందర్‌ను హేళన చేయడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.