టీచర్‌పై కాల్పులు జరిపాడో యువకుడు

తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో స్కూల్‌ టీచర్‌పై కాల్పులు జరిపాడో యువకుడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 22 ఏళ్ల నీతు యాదవ్‌ షేర్‌పట్టిలోని ఓ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం స్కూలు ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరింది.

సుల్తాన్‌పూర్‌ఘౌరీకి చెందిన అంకుల్‌ యాదవ్‌ బైక్‌పై ఆమెను వెంబడించాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను అడ్డగించటంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అంకుల్‌ ఆమెపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారణాసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతోనే అంకుల్‌ ఈ దారుణానికి తెగబడ్డట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరూ 12 వ తరగతి వరకు ఒకే చోట చదువుకున్నారని తెలిసింది.