కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు

చెల్లెలు జీవితాన్ని చిదిమేయాలని చూసిన కన్నతల్లిని కడతేర్చాడు కుమారుడు. తల్లి మెడకు చీరతో ఉరి బిగించి హత్య చేశాడు.. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లమ్మ బండకు చెందిన సురేష్‌ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌. భార్య, తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సురేష్‌ తల్లి మల్లమ్మ (40) చెడు సావాసాలకు అలవాటు పడింది. తండ్రి మద్యానికి బానిసగా మారి భిక్షటన చేస్తుంటాడు.

డబ్బులు సంపాదించాలనే ఆశతో మల్లమ్మ తన మైనర్‌ కుమార్తెను కూడా చెడు మార్గంలోకి దింపాలని చూసింది. ఈ విషయమై పలుమార్లు సురేష్‌ తన తల్లిని మందలించాడు. అయినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఆదివారం తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. సురేష్‌ ఆగ్రహంతో మల్లమ్మ గొంతుకు చీరతో ఉరి బిగించి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.