బ్యుటీషియ‌న్‌తో స‌హ‌జీవ‌నం….ఆత్మ‌హ‌త్య

బ్యుటీషియ‌న్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న గుడివాడ టూ టౌన్ ఎస్ఐ విజ‌య్‌కుమార్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సంచ‌ల‌నం రేకెత్తించే ఈ ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరుకు చెందిన విజ‌య్‌కుమార్‌కు 2012లో ఎస్ఐ ఉద్యోగం వ‌చ్చింది. మొట్ట‌మొద‌ట అత‌ను కృష్ణా జిల్లా హ‌నుమాన్ జంక్ష‌న్‌లో ఉద్యోగ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

ఈ నేప‌థ్యంలో అత‌నికి నూజివీడుకు చెందిన బ్యుటీషియ‌న్‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ కార‌ణంగానే అప్ప‌ట్లో అత‌ను స‌స్పెండ్‌కు గుర‌య్యాడు. కొంత కాలానికి ఎస్ఐపై స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేశారు. అనంత‌రం గుడివాడ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో ఎస్ఐగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ప్ర‌స్తుతం గుడివాడ టూటౌన్ పీఎస్‌లో విధుల్లో ఉంటున్నాడు.

మూడు నెల‌ల క్రితం ఏలూరుకు చెందిన మ‌హిళ‌తో విజ‌య్‌కి వివాహ‌మైంది. అయితే భార్య‌ను మాత్రం కాపురానికి తీసుకెళ్ల లేద‌ని స‌మాచారం. గ‌తంలో వివాహేత‌ర సంబంధం ఉన్న బ్యుటీషియ‌న్‌తోనే అత‌ను గుడివాడ‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఒక వైపు క‌ట్టుకున్న భార్య‌, మ‌రోవైపు స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ మ‌ధ్య అత‌ను కొంత కాలంగా మాన‌సికంగా తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నాడ‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో అత‌ను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఇదిలా ఉండ‌గా బ్యుటీషియ‌న్ ఒత్తిడి వ‌ల్లే విజ‌య్‌కుమార్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. విజ‌య్ మృత‌దేహాన్ని పోలీసులు గుడివాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసుల విచార‌ణ‌లో వివ‌రాలు తెలియాల్సి ఉంది.