మృత్యువు రూపంలో వచ్చిన లారీ

మరికొద్ది సేపట్లో సోదరుని ఇంటికి చేరుకుంటున్నామన్న పాతబస్తీవాసుల సంతోషాన్ని విధి చిన్నచూపు చూసింది. బోర్‌వెల్‌ లారీ మృత్యువు రూపంలో వచ్చి వారి ఆనందాలను ఆవిరయ్యేలా చేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంతో పాతబస్తీ కాలాపత్తర్‌లోని మక్కా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కందవాడ బస్‌స్టేజీ సమీపంలో బోర్‌వెల్‌ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. మిగతా వారిలో ఇద్దరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. హైదరాబాద్‌లోని కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన ఎండీ ఆసిఫ్‌ఖాన్‌(48), అతని భార్య పౌజియా(45) దంపతులు. నబియా బేగం సోదరి నజియా భాను (36) పక్షవాతానికి కర్ణాటక రాష్ట్రంలోని గుర్మట్కల్‌ వద్ద చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కర్ణాటకకు వెళ్లేందుకు పాతబస్తీ నుంచి ఇన్నోవా కారులో బయలుదేరారు.

వీరితోపాటు ఆసిఫ్, నబియాల కూతురు మహేక్‌ సానియా(18), కుమారుడు ఆయాన్‌ఖాన్, ఆసిఫ్‌ తమ్ముడు అన్వర్‌ఖాన్, చెల్లెళ్లు ఆర్షియాబేగం(30), బావలు ఖాలీద్‌(50), తయాబ్‌ఖాన్, వీరి పిల్లలు ఆయేషా(5), నిసార్‌ (7) ఉన్నారు. ఉదయం 5 గంటల సమయంలో వీరు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చేవెళ్ల మండలంలోని కందవాడ బస్టేజీ సమీపంలోకి రాగానే.. మూలమలుపు వద్ద ఎదురుగా చేవెళ్ల వైపు నుంచి వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్నవారు అందులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. ఇన్నోవాలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా.. వీరిలో ఐదేళ్ల ఆయేషాతోపాటు ఆసిఫ్, పౌజియా, మహేక్‌సానియా, నజియా, ఆర్షియా అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఖాలీద్‌ మరణించాడు. ప్రస్తుతం అయాన్‌ఖాన్, తయాబ్‌ఖాన్‌ చికిత్స పొందుతున్నారు. ఏడేళ్ల నిసార్, అన్వర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల్లో విషాదం అలముకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్నోవాలో చిక్కుకుపోయిన మృతదేహాలను తీసి ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు.