స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య

లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఎన్నో రంగాలపై పడింది. ముఖ్యంగా లక్షలాది మంది ప్రయివేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకటి రెండు నెలలు జీతం లేకపోతేనే విలవిల్లాడిపోయే పరిస్థితుల్లో.. నెలల తరబడి జీతం లేకుండా కుటుంబాలను పోషించడం కత్తి మీద సాములా మారింది. గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉండి.. ఒకరి ముందు చేయి చాపాలంటే మనసొప్పక బజ్జీలు అమ్ముకుంటూ.. ఉపాధి కూలీలుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్న గురువులెందరో.

ఆర్థిక ఇబ్బందులో లేదంటో మరో కారణమో తెలీదు గానీ.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. బల్మూర్ మండలం తుమ్మంపేటకు చెందిన మంజూర్ అహ్మద్(54) కుటుంబం గత 30 ఏళ్లుగా అచ్చంపేటలోనే నివాసం ఉంటోంది. అహ్మద్ ‘ది విమలాస్ ఇచ్ డయాన్ హై స్కూల్’లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.

ఆదివారం తన భార్యను బీపీ మాత్రల కోసం బయటకు పంపిన మంజూర్.. ఆమె బయటకు వెళ్లగానే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మంజూర్ అహ్మద్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మంజూరు పెద్ద కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా.. చిన్న కుమారుడు యునాని డాక్టర్‌గా పని చేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తమకు సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.