ఎస్బీఐ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని దారుణ హత్య

అనంత‌పురం : అమ్మాయి తనను దూరం చేసి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆమెను హ‌త్య చేసి పెట్రోల్ పోసి నిప్ప‌టించాడు మాజీ ప్రియుడు. ఈ దారుణ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో ఇటీవ‌లే చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

గూటి రాజేశ్ అనే యువ‌కుడు స్నేహ‌ల‌త‌(19)ను గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. గూటి రాజేశ్ వృత్తి రీత్యా తాపీ మేస్ర్తీ. అయితే స్నేహ‌ల‌త స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌గా ఉద్యోగం ల‌భించింది. దీంతో ఆమె రాజేశ్‌ను దూరంగా పెట్టింది. త‌న కాలేజీ స్నేహితుడైన ప్ర‌వీణ్‌కు ద‌గ్గ‌రైంది. ఈ విష‌యం రాజేశ్‌కు తెలియ‌డంతో తీవ్ర ఆవేశానికి లోన‌య్యాడు. స్నేహ‌ల‌త‌ను చంపాల‌ని రాజేశ్ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నాడు.ఈ క్ర‌మంలో స్నేహ‌ల‌త‌కు ఫోన్ చేసి బ‌య‌ట‌కు రావాల‌ని కోరాడు. స్నేహ‌ల‌త‌ ఉద్యోగం చేస్తున్న బ్యాంక్ వ‌ద్ద‌కు వెళ్లి ఆమెను బైక్‌పై ఎక్కించుకుని అనంత‌పురం ర‌హ‌దారిలో వెళ్లిపోయాడు. బండ‌ప‌ల్లి వ‌ద్ద బైక్‌ను ఆపి.. ప్ర‌వీణ్‌తో స‌న్నిహితంగా ఉంటున్న విష‌యంపై ప్ర‌శ్నించాడు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్నేహ‌ల‌త గొంతు కోసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

త‌ల్లి ఫిర్యాదుతో..

త‌న కుమార్తె బ్యాంకు నుంచి ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్నేహ‌ల‌త ప‌ని చేస్తున్న ప్రాంతం నుంచి 25 కిలోమీట‌ర్ల దూరంలో ఆమె మృత‌దేహం ల‌భ్య‌మైంది. పోస్టుమార్టం నిమిత్తం స్నేహ‌ల‌త మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే రాజేశ్‌తో పాటు కార్తీక్‌కు కూడా ఈ హ‌త్య‌లో ప్ర‌మేయం ఉంద‌ని మృతురాలి త‌ల్లి ఆరోపించింది.

1,618 సార్లు ఫోన్ మాట్లాడుకున్నారు..

స్నేహ‌ల‌త‌, రాజేశ్ ప్రేమించుకున్న కాలంలో ప‌దుల సార్లు కాదు ఏకంగా 1,618 సార్లు ఫోన్ మాట్లాడుకున్నారు. ఈ విష‌యం రాజేశ్ ఫోన్ కాల్స్ రికార్డును ప‌రిశీలించ‌డంతో బ‌య‌ట‌ప‌డింది. రాజేశ్ వ‌ద్ద ఉన్న స్నేహ‌ల‌త ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌వీణ్‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్నందుకే స్నేహ‌ల‌త‌ను హ‌త్య చేశాన‌ని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీక‌రించాడు రాజేశ్‌.