మూసాపేట,తీస్మార్ న్యూస్: పోగమంచు కారణంగా పలు రహదారులపై వాహనాలు ప్రమాదాల బారీనపడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఇలాంటి ఘటనే బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ టైర్ పంచర్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన లారీని ఆపిన డ్రైవర్.. దాని టైర్‌ను మార్చుతున్నాడు. ఈ క్రమంలో కర్నూలు వైపు వెళ్తున్న ఓ డీసీఎం వెనుక నుంచి ఆ లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాలను పక్కకు తొలగించారు. వాహనాల రాకపోకలను క్లియర్ చేశారు. జాతీయరహదారిపై మంచు బాగా కమ్ముకోవడంతో ముందున్న వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
