ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్ ప్రదేశ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాన్పూర్ సమీపంలో ట్రాలీ బోల్తాపడి ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతులంతా కూలీలుగా గుర్తించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులకు ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

భోగినిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌఖాస్ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 22 మంది కూలీలతో అతివేగంగా వెళ్తోన్న ట్రాలీ ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో వాహనంలోని ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా హమీర్‌పూర్ జిల్లాలోని కలార్నీ, బర్నావ్ గ్రామాలకు చెందిన కూలీలు. సిర్సాగంజ్ ఫిరోజాబాద్‌లో ఓ కాంట్రాక్టర్ వద్ద పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంతోపాటు ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించడంతోనే ట్రాలీ బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటంపూర్‌కి చెందిన బాలిక చందావతి (14), రమేశ్, పింకీ, హమీర్‌పూర్‌కు చెందిన రాధ, ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె కోమల్, నాలుగేళ్ల కుమారుడు సూరజ్ చనిపోయారు. ఎటవాకు బొగ్గు లోడుతో వెళ్తోన్న లారీ డ్రైవర్ కూలీలను ఎక్కించినట్టు పోలీసులు తెలిపారు.