యువతిపై అత్యాచారం

ఉరిశిక్షలు, ఎన్‌కౌంటర్లు కూడా కామాంధుల్లో కనీస భయం కలిగించలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. యువతి(23)పై అత్యాచారం చేసి ట్రైన్‌లో నుంచి బయటకు విసిరేసిన అమానుష ఘటన తాజాగా మహారాష్ట్రలోని నవీముంబైలో చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై యువతి పడి ఉందని సమాచారం రావడంతో వశి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంటనే రైల్వే పోలీసులకి సమాచారం అందించారు.

స్టేషన్‌కి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో యువతి ట్రాక్‌ పక్కన పడి ఉందని చెప్పడంతో రైల్వే కానిస్టేబుల్ సంఘటన స్థలానికి వెళ్లారు. తల, ఒంటినిండా గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని వెంటనే కానిస్టేబుల్ రైల్వే పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తల నుంచి రక్తస్రావం అవుతుండడంతో ప్రాథమిక చికిత్స చేయించి వశీలోని ఎన్‌ఎంఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జేజే ఆస్పత్రికి తరలించారు.

ప్రాణాలతో పోరాడుతున్న యువతి అతి కష్టమ్మీద తన వివరాలు వెల్లడించింది. టిట్వాలాకి చెందిన యువతిగా తెలియడంతో వెంటనే పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను వెతికి పట్టుకుని సమాచారం అందించారు. యువతి ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో ఇళ్లలో పనిమనిషిగా చేస్తోందని.. వారాంతాల్లో ఇంటికి వచ్చి వెళ్లేదని తెలిసింది. ఆదివారం రాత్రి ఎప్పటిలానే ఇంటి నుంచి బయలుదేరిన యువతి ఆ తర్వాత నుంచి ఆచూకీ తెలియకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

యువతిపై అత్యాచారం చేసి.. తలపై బలమైన వస్తువుతో కొట్టి కదులుతున్న ట్రైన్‌లో నుంచి బయటకు తోసేసినట్లు పోలీసు విచారణలో తేలింది. అత్యాచారం, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఏ స్టేషన్‌లో ట్రైన్ ఎక్కింది? ఆమె వెంట ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునేందుకు అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. ఆమె కళ్లు తెరిస్తే కేసులో కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.