జైపూర్,తీస్మార్ న్యూస్: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఓ లెక్చరర్ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. తానొక ఉన్నతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరిచి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన కోరికలను తీర్చాలని బలవంతం పెడుతున్నాడు. శృంగారం చేస్తేనే పాస్ మార్కులు వేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నీమ్‌రానాలో వెలుగు చూసింది. నీమ్‌రానాలోని ఓ ప్రభుత్వ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఓ 45 ఏళ్ల వ్యక్తి.. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే తనతో శృంగారంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాడు. లేనిపక్షంలో పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఆ లెక్చరర్ బాధలు భరించలేని విద్యార్థినులు.. కాలేజీకి వచ్చిన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. పొలిటికల్ సైన్స్ లెక్చరర్ వేధింపులకు ఎడ్యుకేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లెక్చరర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.
