దారుణహత్యకు గురైన రైల్వే ఉద్యోగి

రైల్వే ఉద్యోగి దారుణహత్యకు గురైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం…న్యూ సంతోష్‌రెడ్డినగర్‌ కాలనీకి చెందిన మద్ది మహేశ్వరి కుమారుడు మద్ది విజయ్‌కుమార్‌(30) రైల్వే లోకోషెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

ఆరేళ్లక్రితం వైజాగ్‌కు చెందిన భవ్యతో వివాహం జరగ్గా, పీవీఎన్‌కాలనీలో నివాసముంటున్నాడు. వారంరోజుల క్రితం తల్లి మహేశ్వరికి కరోనా సోకింది. భార్యను పుట్టింటికి పంపి తల్లిని రైల్వే ఆస్పత్రిలో చేర్పించాడు. రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఉదయం సంతోష్‌రెడ్డినగర్‌లోని ఇంటికి వచ్చేవాడు. శనివారం ఉదయం వైజాగ్‌లో ఉంటున్న సోదరి ప్రేమలతతో విజయ్‌కుమార్‌ మాట్లాడి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాడు.

కొద్దిసేపటి తర్వాత ప్రేమలత పీవీఎన్‌కాలనీలో ఉంటున్న మేనత్త శారదకు ఫోన్‌ చేసి తమ్ముడు ఏడుస్తున్నాడని, ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. ఆమె అక్కడకు వెళ్లేసరికి ఇంటి ప్రధాన ద్వారం గడియ పెట్టి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. బెడ్‌రూమ్‌లో రక్తపుమడుగులో పడిఉన్న విజయ్‌కుమార్‌ చేసి కేకలు వేసింది.

ఇరుగుపొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని ఏసీపీ శ్యామ్‌ ప్రసాద్‌రావు, క్లూస్‌టీం బృందం పరిశీలించింది. కొబ్బరి బొండాలు నరికే కత్తిని హత్యకు ఉపయోగించడం, మెడపై బలమైన వేటు వేయడంలాంటి కోణాల్లో దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఇది తెలిసినవారే చేసిన పనిగా అనుమానిస్తున్నారు.