సహచర విద్యార్థిని కాల్చిన పీజీ విద్యార్థి

పట్టపగలు తరగతి గదిలో ఓ పీజీ విద్యార్థి అతని సహచర విద్యార్థిపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని బుందేల్‌ఖండ్‌ కాలేజీలో చోటు చేసుకుంది. ఆ యువకుడు అంతటితో ఆగకుండా మరో యువతిపై కూడా కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళ్లితే.. మంథన్ సింగ్ సెంగెర్ అనే పీజీ సైకాలజీ చదివే విద్యార్థి కాలేజీకి వెళ్లి తరగతిలో తుపాకితో తన స్నేహితుడు హుకుమేంద్ర సింగ్ గుర్జార్(22)ను కాల్చాడు.

అనంతరం వింతగా ప్రవర్తిస్తూ.. తరగతి గదిలోని బోర్డు మీద ‘మంథన్ ఫినిష్డ్’ అని రాశాడు. తర్వాత సిప్రీ బజార్ ప్రాంతానికి వెళ్లి కృతికా త్రివేది అనే యువతిపై కాల్పులు జరిపాడు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా కృతికా త్రివేది మరణించింది. హుకుమేంద్ర సింగ్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాల్పుల శబ్దం వినిపించగానే కృతికా కుటుంబ సభ్యులు మంథన్ సింగ్‌ను పట్టుకొని విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంథన్‌ సింగ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నివారి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. హుకుమేంద్ర, కృతికా విద్యార్థులు ఇద్దరూ ఝాన్సీ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు 2016 నుంచి మంచి స్నేహితులని కళాశాలలో గుమాస్తాగా పని చేస్తున్న హుకుమేంద్ర మామ సంజయ్ సింగ్ తెలిపారు. తన స్నేహితులు అతని గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని కోపం పెంచుకున్న మంథన్‌ కాల్పులకు పాల్పడిట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.