పిల్లలు అడిగారు…తల్లిదండ్రులు ప్రేమతీరా చంపిపెట్టారు

తల్లిదండ్రులున్నదెందుకు? పిల్లలకు చేసిపెట్టటానికే. ఎదగాలని వండి పెడతారు. చదవాలని హోమ్ వర్క్ చేసిపెడతారు. అడిగిందెల్లా కొనిపెడతారు. కావలసినవన్నీ అమర్చిపెడతారు. ఉద్యోగం చూసిపెడతారు. ఇల్లు కట్టి పెడతారు. ఈడొచ్చాక తోడును కూడా చూపిపెడతారు. ‘ఇన్ని చేసినవాళ్ళం చంపిపెట్టాలేమా?’ అనుకున్నారు ఇద్దరు దంపతులు. చంపేశారంతే.ఈడొచ్చిన ఇద్దరు కూతుళ్ళను కొన్ని గంటల వ్యవధిలో తల్లిదండ్రులే హతమార్చారు. కోపంతో కాదు, చీకాకుతో కాదు, ఆవేశం ఆపుకోలేక కాదు. భక్తిని తాళలేక. ఎందరికో భక్తి వుంటుంది. ఆ భక్తిలో పిల్లల క్షేమం వుంటుంది. తమ బిడ్డల్ని చల్లగా చూడమనటమే వాళ్ళు దేవుడికి చేసే విన్నపం. మరి ఈ తల్లి దండ్రులు? ‘నువ్వే చూసుకో చల్లగా’ అంటూ ‘దేవుడి దగ్గర’కు పంపించేద్దామనుకున్నారా?.మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో జనవరి 24 న జరిగిన ఘటన తెలుగు రాష్ట్ర‌ ప్రజలనే కాదు, దేశ ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వెల్లూరు పురుషోత్తమ నాయుడు, పద్మజ. వీరద్దరూ దంపతులు. బాగా చదువుకున్నారు. ఒకరు కెమెస్ట్రీలో పి.హెచ్.డి చేస్తే, ఇంకొకరు మేథమెటిక్స్ పీజీలో గోల్ట్‌మెడలిస్టు. పైపెచ్చు ఇద్దరూ అధ్యాపకులే. చిత్తూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో పనిచేస్తుంటే, భార్య గత పాతికేళ్ళుగా, సొంత కోచింగ్ ఇస్పిట్యూట్‌లో బోధిస్తోంది. ఈ మధ్యనే  మూడంతస్తుల మేడ కట్టుకుని, అందులోకి దిగారు.ఇంత బాగా చదివిన వాళ్ళు, పిల్లల్ని బాగా చదివించకుండా వుంటారా? ఉన్న ఇద్దరు ఆడపిల్లల్నీ  గొప్పగానే చదివించారు. పెద్ద అమ్మాయి అలేఖ్య(27) భూపాల్‌లో డిప్లమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ చదివింది.  ఇక చిన్నమ్మాయి సాయి దివ్య (22) బెంగుళూరులో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తోంది. అంతేకాదు. ఏ కలెక్టరు కావాలనుకుందో, సివిల్ సర్వీసెస్ కు కూడా ప్రిపేర్ అవుతోంది. కోవిద్ వల్ల ఇద్దరూ తమ తల్లి దండ్రులతో కలసివుండే అవకాశం వుంది. అన్నట్టు వీరికి ఒక కుక్కపిల్ల కూడా వుంది. అదే మలుపు తిప్పింది. కథను కాదు.ఈ ఆడపిల్లలనిద్దరినీ. వీరిద్దరూ ఆ కుక్కను వ్యాహ్యాళికి తీసుకువెళ్ళినప్పుడు, ఓ టర్నింగ్ దగ్గర జరిగిన చిన్న అనుభవం, పెద్ద అనుమానానికి దారి తీసింది. అక్కడ ఇద్దరిలో ఒకర నిమ్మకాయ తొక్కేశారు. దాంతో మిరపకాయలున్నాయి. అవి కూడా పొందిగ్గా ఒక ముగ్గులో వున్నాయి. తమ వెంట ఏ ‘క్షుద్రశక్తి వస్తుందో’నన్న అనుమానంతో ఇంటికి వచ్చారు. ‘అనుమానం పెనుభూతం’ అని పెద్దలు ఎందుకన్నారో పాపం వాళ్ళకు తెలీదు. భూతం పెద్దదా, చిన్నదా అన్న అంచనాకు రాలేక పోయారు కానీ, మొత్తానికి, భూతం వచ్చిందని ఖరారు చేసుకున్నారు.అతిథుల్ని పిలిచినట్లు భూతాలను పిలవరు కానీ, రావటం మాత్రం సపరివారంగానే వస్తాయని కూడా నమ్మేసినట్టున్నారు. ఇల్లు ఇల్లు అంతా భూతాలయంలా మారిందనుకున్నారు. విషయాన్ని మెల్లగా తల్లిదండ్రులకు సిధ్ధంగా వున్నారు. వారి ఈ విషయాలను విని, నమ్మటం కాదు, నమ్మటానికి సిధ్ధంగా వుండి మరీ వినేశారు. ఈ సంసిధ్ధత వాళ్ళకిప్పటిది కాదు. మరీ ముఖ్యంగా పద్మజ బోధించటం లెక్కలు బోధిస్తారు కానీ, చదవటం మాత్రం, తాంత్రిక గ్రంథాలనే తెప్పించుకుని మరీ, గత కొన్నేళ్ళుగా చదువుతున్నారు. నమ్మక చస్తారా? ‘చచ్చినట్టు’ నమ్మేసారు. కాదు, కాదు, ‘చస్తే బతుకుతామని’ నమ్మేశాను. అలాంటి బతుకే, సిసలైన బతుకు కూడా నమ్మేశారు. ఈ నమ్మకాన్ని ఓ మంత్రగాడు కలిగించి వుంటాడని అంటున్నారు. కానీ ఆ పాత్ర ఇంకా వెలుపలికి రాలేదు.భూతవైద్యుణ్ణి పట్టుకుంటే, దయ్యాన్ని దించేస్తాడంటారు. మరి భూతవైద్యుణ్ణి దించాలంటే? దయ్యాన్ని పట్టుకోవాలి. దయ్యం పోలీసులకు దొరకదు కదా! సీసీ ఫుటేజ్‌లకు చిక్కితే, అది దయ్యం ఎందుకు అవుతుంది. అసలు వుంటే కదా చిక్కటానికి?మంత్రగాడు రాగానే, ఒక కూతరు దేహంలో ‘క్షుద్రశక్తి’ వుందని చెప్పేశాడు. అతను అంతవరేక చెప్పాడా? ఇంకా చెప్పాడా? తెలీదు కానీ, తల్లి పద్మజ, తండ్రి నాయుడు  ఓ భారీ ‘హారర్’ చిత్రానికి సరిపడా స్క్రీన్‌ప్లే రాసిపెట్టేసుకున్నారు. (ఆనక ఈ విషయం పోలీసులుతో చెప్పారు లెండి!). కది కలియుగం కదా! కాని క్లయిమాక్సుకొచ్చేసింది. అందుకే అన్నీ దుర్మార్గాలు జరిగిపోతున్నాయి… ఆగండాగండి.. ఈ మాత్రం ఉపన్యాసం ఏ ఆధ్యాత్మిక గురువయినా చెప్పేస్తాడు కదా అని అనేసుకోకూడదు. ఆతర్వాత వచ్చేది సత్యయుగం. ఇందులో లోకాన్ని ప్రవేశపెట్టటానికి ఒక మంచి కుటుంబం కావాల్సివచ్చింది. ఆ కుటుంబమే ఈ కుటుంబం. సత్యయుగారంభానికి వాళ్ళు చెయ్యాల్సిందెల్లా చనిపోవటమే. అందులో భాగంగా ఒకరినొకరు చంపుకుంటూ వెళ్ళానుకున్నారు. ఇద్దరు పిల్లలు చనిపోయాక, తండ్రికి ఎందుకో ఈ స్క్రిప్టు నచ్చలేదు. దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.

దీని పేరు నమ్మకం.. కాదు మూఢనమ్మకం.