సొంత బిడ్డనే హత్యచేసిన తల్లిదండ్రులు

పిల్లలు లేరని కొన్ని జంటలు తల్లడిల్లుతుంటే, ఈ జంట మాత్రం తమ ముద్దులొలికే తమసొంత బిడ్డనే నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీనిపై కూపీ లాగిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. దీంతో వీరి బండారం బైటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మిడిల్‌ టౌన్‌కు చెందిన బ్రిటానీ గోస్ని, జెమ్స్‌ హామిల్టన్‌ భార్యభర్తలు.

వీరికి జెమ్స్‌ హట్చింగ్‌సన్‌ అనే 6 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. వీరు గత ఆదివారం ఉదయం మిడిల్ ‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్లను ఆధారంగా పోలీసులు బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ‍ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు జెమ్స్‌, హమిల్టన్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి వెలుగు చూసింది.

కుమారుడిని తామే హత్యచేసినట్లు తల్లిదండ్రులు నేరం అంగీకరికరించారు. బాలుడిని చంపి ఓహియో నదిలో పడేశామని తెలిపారు. దీంతో బాలుడి హత్య, కేసును తప్పుదోవ పట్టించడం వంటి పలు అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్ట్‌ చేశారు. కన్నకొడుకును పొట్టన పెట్టుకున్న తల్లి గోస్నిలో ఏ మాత్రం పశ్చాత్తాపం లేకపోగా తండ్రి జెమ్స్‌ హామిల్టన్‌ మాత్రం తన చర్యపట్ల తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు బాలుడి శవం కోసం పోలీసులు ఓహియో నదిలో గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటం వలన మృతదేహాన్ని వెతకడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మిడిల్‌టౌన్‌ పోలీస్‌ డేవిడ్‌ బిర్క్‌ తెలిపారు. దీనిపై కన్నబిడ్డనే అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని చిరునవ్వును మాత్రం ఎప్పటికి మరవలేమంటూ సంతాపం ప్రకటించారు.