భార్యను కత్తితో పొడిచి చంపిన వృద్ధుడు

కాటికి కాళ్లు చాపిన వయసులో కర్కశంగా ప్రవర్తించాడో భర్త. భార్యను కత్తితో పొడిచి చంపి, ఇంట్లోనే నిప్పంటించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని డోంబివ్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బలిరామ్‌ పాటిల్‌(84) అతడి భార్య పార్వతీ, కుటుంబసభ్యులతో కలిసి డోంబివ్లి, పాండురంగావాడీలోని తమ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. బలిరామ్‌ ముక్కోపి, ప్రతీ చిన్న విషయానికి సీరియస్‌ అయ్యేవాడు. దీంతో భార్యతో ఎప్పుడూ గొడవపడేవాడు. ఆదివారం తెల్లవారుజామున కూడా భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బలిరామ్‌ భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.

అనంతరం ఆమె మృతదేహానికి నిప్పంటించి ఇంట్లోంచి పరారయ్యాడు. ఉదయం 8 గంటల సమయంలో వృద్ధుల గదిలోంచి పొగలు రావటం గుర్తించింది అతడి కోడలు. వెంటనే ఇంట్లోవారికి విషయం చెప్పింది. వారంతా తలుపులు బద్ధలు కొట్టి చూడగా మంచంపై సగం కాలిపోయి ఉన్న పార్వతి మృతదేహం కనపడింది. బలిరామ్‌ కూడా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.