కరోనాతో నర్సు మృతి

గుడియాత్తంప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో పనిచేస్తున్ననర్సు కరోనాతో మృతిచెందారు. వివరాలు.. వేలూరు జిల్లా పేర్నంబట్టు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన గోపాలక్రిష్ణన్‌ భార్య ఎయుళరసి (40) ప్రభుత్వ నర్సుగా పనిచేస్తున్నారు. గోపాలక్రిష్ణన్‌ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఇదిలా ఉండగా ఎయుళరసికి ఈనెల 15న పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె అదే వార్డులో చికిత్స పొందుతున్నారు.

ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల 21న వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కరోనా వార్డులో ఎంతో మంది రోగులకు చికిత్స అందజేసిన నర్సు అదే వ్యాధితో మృతి చెందడం పలువురిని కలచివేసింది. కాగా గుడియాత్తం ప్రభుత్వాస్పత్రిలోని కరోనా వార్డులో చికిత్స అందజేస్తున్న ఐదుగురు డాక్టర్‌లు, నర్సులకు కరోనా పాజిటివ్‌ రావడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం గమనార్హం.