పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన

పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న యువకుడిని గుర్తు తెలియని దుండగులు అమానుషంగా చంపేశారు. కత్తులతో వెంటపడి నరికి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన అంతర్గాం మండలం మద్దిరాల శివారులో జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మారం మండలానికి చెందిన సందెల రమేష్ మద్దిరాల గ్రామ శివారులోని పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా కొందరు దుండగులు కారులో వచ్చారు.

అమాంతం కత్తులతో దాడి చేశారు. రమేష్ తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటపడి మెడ, తలపై దారుణంగా నరికారు. తీవ్రగాయాలపాలైన రమేష్ పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.