జగిత్యాల జిల్లాలో ఘోరం

జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. పెండ్లి ఊరేగింపులో నలుగురు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ దారుణ హత్యకు దారితీసింది. యువకుడిని కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన మేడిపల్లి మండలం భీమారంలో చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న గ్రామానికి చెందిన పూదరి లక్ష్మణ్ (20)కి అదే వేడుకలకు హాజరైన మరో ముగ్గురు యువకులతో వివాదం తలెత్తింది. ఊరేగింపు జరుగుతుండగా లక్ష్మణ్‌తో ముగ్గురు యువకులు ఘర్షణకు దిగారు.

మాటామాటా పెరగడంతో చినికిచినికి గాలివానగా మారింది. ఆగ్రహంతో రగిలిపోయిన ముగ్గురు యువకులు అదనుచూసి అమానుషంగా అంతమొందించారు. కత్తితో కిరాతకంగా పొడిచి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్సై సుధీర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.