రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేమికుల ఆత్మహత్య

భోపాల్‌ : కుటుంబసభ్యులు తమ వివాహానికి నిరాకరించారనే మనస్తాపంతో కదులుతున్న రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఒబెదుల్లాగంజ్‌ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్న టీనేజ్‌ ప్రేమికులు పెండ్లి చేసుకోవాలని కోరుకున్నారు. భోపాల్‌కు చెందిన 17 ఏండ్ల బాలిక,యువకుడు (19) అర్ధంతరంగా తనువు చాలించడంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగాయి. మూడు రోజుల కిందట వీరు అదృశ్యమై చివరకు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

ప్రేమ జంట శుక్రవారం మధ్యాహ్నం బంగ్రాసియాకు క్యాబ్‌ బుక్‌ చేసుకుని అక్కడకు చేరుకున్న అనంతరం ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు. ఆపై అక్కడి ఆలయాన్ని సందర్శించి అనంతరం సమీపంలోని బిమ్‌ బెట్కా గుహలను చూసేందుకు వెళ్లారు. అక్కడ క్యాబ్‌ డ్రైవర్‌కు డబ్బులు చెల్లించిన అనంతరం తాము రైలులో ఇంటికి వెళతామని అతడితో చెప్పారు. ఇక సాయంత్రం వారు జన్‌శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రేమికుల కోసం గాలిస్తున్న భోపాల్‌ పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ సమాచారంతో వీరి మృతదేహాలను గుర్తించారు. ప్రేమికుల బంధాన్ని తల్లితండ్రులు నిరాకరించడం, వారి వివాహానికి ఇరు కుటుంబాలు సమ్మతించకపోవడంతో యువ జంట తీవ్ర నిర్ణయం తీసుకుంది.