ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య

ఎంబీబీఎస్‌ చదివినప్పటికీ సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్‌ బోయిన్‌పల్లి లోని సాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఎంబీబీఎస్‌ విద్యార్థి శరన్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం ఎంఎస్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. శరన్‌ తన విద్యా ధ్రువపత్రాల కోసం నెల్లూరు నుంచి హైదరాబాదులోని జీడిమెట్లలో ఉండే తన మిత్రుడు రాము ఇంటికి వచ్చి సాయంత్రం వరకూ గడిపినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం అతను తిరిగి ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయాడు. చరణ్‌ తల్లి అతనికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ రావడంతో రాముకి సమాచారం అందించింది. రాము శరణ్‌ ఇంటికి వెళ్లే సరికి లాక్‌ వేసి ఉంది. కిటికీ లోంచి చూడగా చరణ్‌ ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మానసిక ఇబ్బందులు, ఉద్యోగం రాలేదన్న దిగులుతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.