అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాలడుగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన మాణిగ భాస్కర్‌ అలియాస్‌ బజార్‌ కోదాడ మండల ద్వారాకుంట గ్రామానికి చెందిన శైలజ (27)ను సుమారు ఐదేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం ఘర్షణ పడుతుండేవారు. దీంతో శైలజ తరచూ పుట్టింటింకి వెళ్తుండేది.

మూడు రోజుల క్రితం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో శైలజ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. కాగా కొందరు రైతులు ఆదివారం పాలడుగు సమీపం నుంచి వెళ్తుండగా బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. బావి వద్దకు వెళ్లి గమనించగా శైలజ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా.. వారు శనివారం మధ్యాహ్నం వరకు ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.