వివాహిత ఆత్మహత్య

మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందమైన భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నది. పెళ్లైన కొద్ది కాలనికే అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డిలోని గుమస్తా కాలనీ సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… వాంబే కాలనీకి చెందిన స్రవంతి (19) అనే యువతి గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్‌ను ప్రేమించింది. వారిద్దరు ఈఏడాది జనవరి 7న ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన పేరును సమీరాగా మార్చుకుంది. గత రెండు నెలలుగా అత్తవారింటి నుంచి బయటకు వచ్చి భర్తతో కలిసి వేరే కాపురం ఉంటున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్రవంతి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కూతురు ఒంటిపై గాయాలున్నాయని, ఆమె మృతిపై సందేహాలు ఉన్నాయని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.