మధ్యప్రదేశ్‌లో దారుణం

ఆడపిల్లలు పుట్టారని రాజా భయ యాదవ్ అనే ఓ వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలోకి నెట్టివేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజా భయ యాదవ్ అనే వ్యక్తి భార్య మూడు నెలల క్రితం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే కొడుకు కాకుండా కుమార్తెకు జన్మనిచ్చినందుకు యాదవ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అతని భార్య ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇక ఈ ఘటనలో అతని ఎనిమిదేళ్ల కుమార్తె మరణించగా.. మహిళను, ఆమె మూడు నెలల కుమార్తెను గ్రామస్తులు రక్షించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పైగా బావిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన భార్యపై నిందితుడు రాళ్లతో దాడి చేశాడని వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉన్నాడని.. అతడిపై హత్య, హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆచూకి కోసం గాలిస్తున్నట్టు చంద్లా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర సింగ్ తెలిపారు.