పెరోల్‌పై వచ్చి.. బాలికపై లైంగికదాడి,హత్య

ముంబై: పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు మూడేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలోని పెన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఆదేశ్ పాటిల్ అనే 35 ఏండ్ల వ్యక్తిపై లైంగికదాడి, దొంగతనాలు వంటి పలు కేసులున్నాయి. లెంగిక దాడి కేసులో జైలులో ఉన్న అతడు పది రోజుల కిందట పెరోల్‌పై విడుదల అయ్యాడు. బుధవారం తెల్లవారుజామున తలుపులు లేని ఒక గుడిసెలో తల్లిపక్కన నిద్రిస్తున్న మూడేండ్ల బాలికను ఎత్తుకెళ్లాడు. సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ పసిపాపపై లైంగికదాడి జరిపి హత్య చేశాడు. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని తల్లి పక్కన పడుకో పెట్టేందుకు ఆ ఇంటికి వచ్చాడు. గమనించిన పాప అమ్మమ్మ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని గంటల్లోనే ఆదేశ్ పాటిల్‌ను అరెస్ట్‌ చేశారు. లైంగిక దాడి, హత్యతోపాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు నిరసనకు దిగారు. పసిపాపపై దారుణానికి ఒడిగట్టి హతమార్చిన కిరాతకుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.