మహిళ దారుణ హత్య

రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను పాశవికంగా హత్యచేశాడో వ్యక్తి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదనే అనుమానంతో ఆమెను హతమార్చాడు. వివరాలు.. మృతురాలికి గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. అయితే వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన సదరు మహిళ, తన ముగ్గురు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉండేది. అప్పుడప్పుడూ కర్నాటకకు వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మహ్మద్‌ మోసిన్‌ఖాన్‌(కిరోసిన్‌ డీలర్‌) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్న వీరు అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్ల తర్వాత మహ్మద్‌, అతడి భార్య మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అతడు అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్యను కసితీరా పొడిచేశాడు మహ్మద్‌. దీంతో పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యి ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి మరణించడంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.