సూసైడ్‌ నోట్‌ రాయించి ఉరేసి చంపాడు

మండలంలోని ఉత్తరపు కండ్రిగలో బుధవారం భానుప్రియ(26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విచారణ చేపట్టిన పోలీసులు భర్త నారాయణమూర్తే భార్యను హత్యచేశాడని గురువారం తేల్చేశారు. పోలీసుల కథనం మేరకు.. నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మహీధర్‌(6), బాబి(4) అనే ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో భానుప్రియను స్థానికులైన ఉపాధ్యాయుడు గోపి, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ధనశేఖర్‌ వేధిస్తుండేవారు. దీంతో అనుమానం పెంచుకున్న నారాయణమూర్తి సైతం భార్యను ఇబ్బందిపెట్టేవాడు.

దీనిపై మూడురోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. ఆగ్రహించిన నారాయణమూర్తి భార్యతో బలవంతంగా సూసైడ్‌ నోట్‌ రాయించి, ఉరేసి చంపేశాడు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ధనశేఖర్‌ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టాడు. చివరకు నారాయణమూర్తే అసలు నిందితుడని తెలియడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ధనశేఖర్‌ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపై మరో కేసు నమోదు చేశారు.