మద్యం మత్తులో హత్య

మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని వాయునందన ప్రెస్‌ వీధిలో జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన అనురాధ (32)తో కావలికి చెందిన పెసల మాల్యాద్రితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. మాల్యాద్రి మద్యానికి బానిసై నిత్యం భార్యతో ఘర్షణ పడేవాడు. గత నెల 25న ఇద్దరికి కరోనా సోకడంతో పిల్లలను ఇతరుల ఇంట్లో పెట్టి, వారు తమ ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ నెగిటివ్‌ వచ్చింది.

గురువారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మాల్యాద్రితో అనురాధ చెప్పింది. అప్పటికే చిత్తుగా మద్యం తాగి ఉన్న మాల్యాద్రి, ఇద్దరం కలసి చనిపోదామని భార్యతో చెప్పి ఆమె చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోశాడు. నరం తెగిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మాల్యాద్రి కూడా బ్లేడ్‌తో చేతిని కోసుకున్నాడు. శుక్రవారం ఉదయం మాల్యాద్రి స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు చెప్పి లొంగిపోయాడు. కాగా, కరోనాతో ఇబ్బంది పడుతున్నామని, ఇద్దరం చనిపోదాం అని చెప్పడంతో అందుకు తన భార్య కూడా అంగీకరించిందని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు చెబుతున్నాడు.