నిద్రపోతున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు

నిద్రపోతున్న వ్యక్తిని లేపి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన గుణుపూర్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని గుడారి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సంచలనం రేకిత్తిస్తోంది. నైరా గ్రామానికి చెందిన కిరణ్‌ గంటా(30) శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇంటి బయట పడుకున్నాడు. గుర్తు తెలియని కొంతమంది దుండగులు అక్కడికి చేరుకుని, అతడిని నిద్రలేపి నుదుటిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. అయితే తుపాకీ కాల్పుల శబ్దం విన్న ఇంటి లోపల పడుకున్న బాధిత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా, రక్తపు మడుగులో ఉన్న కిరణ్‌ని చూసి ఆశ్చర్యపోయారు.

దగ్గరికి వెళ్లి అతడి శ్వాసని పరీక్షించగా, అతడు మరణించినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు.తన భర్తకి ఎవరితో శత్రుత్వం లేదని, ఇలా ఎందుకు జరిగిందో..ఎవరు చేసి ఉంటారో తమకు తెలియడం లేదని మృతుడి భార్య రైనా గంటా తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీం, సైంటిఫిక్‌ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేకపోతే మరేదైనా కారణం ఉండి ఉంటుందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు గుణుపూర్‌ సబ్‌డివిజనల్‌ పోలీస్‌ అధికారి రాజ్‌కిశోర్‌ దాస్‌ తెలిపారు.