కోతిని తప్పించబోయి పల్టీ….

సూర్యాపేట: జిల్లాలోని విజయవాడ జాతీయ రహదారిపై కోతిని తప్పించపోయి ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుచ్చిబాబు అనే వ్యక్తి తన కారులో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సూర్యాపేట మండలంలోని టేకుమట్ల బస్టాండ్‌ వద్ద కారుకు అడ్డంగా కోతి వచ్చింది. దీంతో దానిని తప్పించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అయితే కారులో ఎయిర్‌ బెలూన్లు తెరచుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బుచ్చిబాబును దవాఖానకు తరలించారు. రోడ్డుపై అడ్డంగా పడిఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.