ముంబై: మహారాష్ట్రలో అమీర్ హాసన్ (19) అనే వ్యక్తి తన స్నేహితుడైన జుబేర్ హసన్ ఖాన్ (24) చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. అమీర్ హాసన్ తన ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో జుబేర్ ఖాన్ అతడిని దారుణంగా హత్య చేశాడు. నవీ ముంబైలోని షిల్ ఫాటా ఏరియాలో ఈ నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలోని చెంబూర్ ఏరియాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవీ ముంబైలోని షిల్ ఫాటా ఏరియాకు చెందిన అమీర్ హాసన్, జుబేర్ హసన్ ఖాన్ ఇద్దరూ స్నేహితులు. గతంలో ఒకసారి అమీర్ హాసన్ ఫోన్ నుంచి జుబేర్ ఖాన్ తన ప్రియురాలికి ఫోన్ చేసి మాట్లాడాడు. దాంతో ఆ తర్వాత అమీర్ హాసన్ కూడా ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. క్రమంగా అది వారి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ విషయం జుబేర్‌కు తెలియడంతో అమీర్ హాసన్‌పై పగ పెంచుకుని అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ నెల 26న దొంబివ్లీ వెళ్తున్న అమీర్ హాసన్‌ను తాను డ్రాప్ చేస్తానని చెప్పి జుబేర్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు. నిర్మాణనుష్య ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆటోను రోడ్డు పక్కన ఆపి, హాసన్‌ను ఆటో నుంచి బయటికి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం శవాన్ని రోడ్డు పక్కనే బొందతీసి పాతిపెట్టాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అమీర్ హాసన్ మిస్సయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
