యువతులను మోసం చేసిన కేటుగాడు

ప్రేమ పేరుతో యువతులను మోసం చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని అమ్మాయిలను బురిడీ కొట్టించిన వివాహితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు… కుర్ర విజయభాస్కర్‌ 2017 జూన్‌లో సౌజన్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం భార్యను వేధించేవాడు. తన అవసరాలు తీర్చకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పలువురు యువతులతో పరిచయం పెంచుకున్న విజయభాస్కర్‌.. ప్రేమ పేరుతో వారికి దగ్గరయ్యేవాడు. నువ్వంటే చాలా ఇష్టం.. లవ్‌ యూ.. నీతో మాట్లాడాలని ఉంది.. నాది నిజమైన ప్రేమ అంటూ వారికి మాయ మాటలు చెప్పేవాడు. పూర్తిగా తన వలలో పడిన తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇలా ఆరుగురు అమ్మాయిలను అతడు మోసం చేశాడు. కాగా విజయభాస్కర్‌ అరాచకాలకు విసిగిపోయిన భార్య సౌజన్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని తనను నమ్మించి పెళ్లి చేసుకున్నాడని, మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టగా ఛీటర్‌ విజయభాస్కర్‌ గుట్టు రట్టయింది.