కత్తితో హల్చల్ చేసిన యువకుడు

ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాడు.. ఇంట్లో ఉందామంటే కుటుంబ కలహాలు.. దీంతో ఆ యువకుడు పిచ్చోడిలా మారాడు. ఎవరిపైనో కోపం.. ఆ కోపాన్ని ఎవరిపై చూపించుకోవాలో తెలియదు. కానీ ఫస్ట్రేషన్‌ తీవ్రంగా ఉంది. దీంతో చివరకు ఉండబట్టలేక వీధిలోకి వచ్చాడు. వచ్చి రాగానే కనిపించిన వారందరిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. అతడి చేతికి ఆరుమంది బలయ్యారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన చైనాలో జరిగింది.ఈశాన్య చైనాలో హువైనింగ్‌ కౌంటీలో నివసించే వూ (25) నిరుద్యోగి. నిరాశవాదంతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి తోడు ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో మనశ్శాంతి కోల్పోయాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అనుహుయ్‌ ప్రావిన్స్‌లోని ఆన్‌కింగ్‌ నగరంలోకి వచ్చాడు. కత్తి తీసుకుని వచ్చి కనిపించిన వారందరినీ తీవ్రంగా గాయపర్చాడు.

అతడు కత్తితో బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు పెట్టాడు. ఈక్రమంలో అతడు మొత్తం 20 మందిని గాయపర్చాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అతి కష్టంగా అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.అయితే గాయపడ్డవారిలో ఆదివారం ఆరుగురు మృతి చెందారు.

ఇంకా 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ‘ఆన్‌కింగ్‌ నగరంలోని రెన్‌మిన్‌ రోడ్డులో ఫుట్‌పాత్‌పై నడుస్తున్నవారిని వూ కత్తితో దాడి చేశాడు’ అని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. అsతడు కుటుంబ కలహాలతో పాటు నిరాశావాదంతో బాధ పడుతున్నాడని అక్కడి పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్రోశం.. బాధ తట్టుకోలేక కత్తితో దాడి చేశాడు అని వివరించారు.