మావోయిస్టుల అణచివేతలో మానుకోటకు మొదటి స్థానం

మహబూబాబాద్ : రాష్ట్రంలో మావోయిస్టుల అణచివేతలో మహబూబాబాద్ జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి, పోలీస్‌ బృందాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్పీ మావోయిస్టు కార్యకలాపాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. నెత్తురు బొట్టు చిందించకుండా మావోలు జనజీవన స్రవంతి కలవమని పిలుపునిచ్చారు. వారి కుటుంబాలను కలుస్తూ వారికితోడుగా నిలుస్తూ వచ్చారు.మావోయిస్టు కార్యకలాపాలను ఎక్కడికక్కడ అణచివేస్తూ జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను జరుగకుండా శాంతి స్థాపనకు కృషిచేశారు. ఇందుకు గుర్తింపుగా డీజీపీ మహేందర్ రెడ్డి రివార్డ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా నిరంతరం కృషి చేస్తామన్నారు. పోలీస్‌ శాఖకు సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.