మదనపల్లి కేసులో కొత్త ట్విస్ట్

మదనపల్లిలో జరిగిన జంట హత్యల కేసులో పురుషోత్తంనాయుడు, పద్మజల పెద్దకూతురు అలేఖ్య కారణమని తెలుస్తున్నది. పునర్జన్మలపై ఆమెకున్న అతి విశ్వాసమే ఈ ఘాతుకానికి పురికొల్పినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పెంపుడు కుక్కను చంపేసి తిరిగి బతికించినట్టు అలేఖ్య తన తల్లిదండ్రులను నమ్మించింది. అలేఖ్య (27), సాయిదివ్య(22) కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తాను చనిపోతాననే భావనలో సాయిదివ్య ఉండగా అలేఖ్య బలపరుస్తూ వచ్చింది. ఈ నెల 24న తల్లిదండ్రులు మంత్రగాడితో తాయెత్తు కట్టించారు. అయినా సాయిదివ్యలో ఈ భావన తగ్గలేదు. సాయిదివ్య బిగ్గరగా ఏడుస్తూ మరుసటి రోజు చనిపోతానని అరుస్తుండటంతో తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో మరింత గట్టిగా ఏడువటంతో చెల్లెలు దివ్యను చంపేయాలని, తాను మళ్లీ బతికిస్తానని అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది. పెద్దమ్మాయి మాటలు విన్న తల్లిదండ్రులు సాయిదివ్యను డంబెల్‌తో కొట్టారు. తర్వాత నుదుటిపై కోశారు.

ఈ క్రమంలో సాయిదివ్య చనిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలకు తనను కూడా చంపేయాలని, చెల్లిని తీసుకొని వస్తానని అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే తల్లిదండ్రులిద్దరు కూడా అలేఖ్యను పూజ గదిలోకి తీసుకెళ్లి నోట్లో కలశం పెట్టి తలపై డంబెల్‌తో మోదటంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య మరణించింది. ఈ విధంగా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇద్దరు అక్కాచెల్లెండ్లు మృత్యువాత పడ్డారు. కొన్ని రోజులుగా ఈ కుటుంబీకులు అన్యమనస్కంగా ఉంటున్నారని తెలుసుకున్న గౌరీశంకర్‌ అనే విశ్రాంత అధ్యాపకుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజును పురుషోత్తం నాయుడు ఇంటికి వెళ్లాలని కోరారు. ఆయన వెళ్లగా పూజగదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గ్లాసు ముక్కలు కనిపించాయి. రాత్రి 9.30 గంటలకు తాలూకా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

డెల్యూషన్‌ కారణం:

రెండురోజుల విచారణ అనంతరం పద్మజ, పురుషోత్తం నాయుడును పోలీసులు జడ్జిఎదుట హాజరు పర్చి సబ్‌జైలుకు తరలించారు. జైలులోనూ పద్మజ పూజలు చేస్తూనే కనిపించింది. ‘నేను శివుణ్ని.. నేను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పిల్లలను బతికించుకుంటాను.’ అంటూ తనదైన ధ్యాసను కొనసాగించింది. తన భార్య చెపుతున్నందంతా తాను విశ్వసిస్తానని, తమ పిల్లలు లోకకల్యాణం కోసమే చనిపోయినట్టు పురుషోత్తంనాయుడు చెప్పారని జిల్లా దవాఖాన సైక్రియాటిస్ట్‌ డాక్టర్‌ రాధిక పేర్కొన్నారు. బిడ్డలు చనిపోయారన్న చిన్న బాధ ఉన్నప్పటికీ కచ్చితంగా లోకకల్యాణం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలుపడం గమనార్హం. తప్పు చేశామన్న భావన, పశ్చాత్తాపం వారిలో ఏ మాత్రం లేదని రాధిక తెలిపారు. వీరు మానసికశాస్త్రంలో తీవ్రమైన మానసిక వ్యాధి ‘డెల్యూషన్‌’ తో బాధపడుతున్నట్టు తెలిపారు. దంపతులిద్దరినీ మానసిక వైద్యశాలకు తరలిస్తే మెరుగయ్యే పరిస్థితి ఉన్నదని, వారిని తరలించేందుకు అవకాశం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణయాదవ్‌ను కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి రాగానే తరలించే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

ఎవరా మూడోవ్యక్తి ?

ఈ హత్యల కేసులో కొత్తకోణం బయటపడింది. సాయి దివ్య, అలేఖ్యల హత్యకేసులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నదని బుధవారం స్థానిక బుగ్గకాలువలో ఉంటున్న మాంత్రికుడు సుబ్బరామయ్య తెలిపారు. ‘స్థానికులైన సాయిచిత్ర భాస్కర్‌, రాజు తమ బంధువులమ్మాయికి సీరియస్‌గా ఉందంటూ పురుషోత్తం నాయుడు, పద్మజల ఇంటికి తీసుకెళాడు. పై అంతస్తు నుంచి చిన్మమ్మాయి సాయిదివ్య అరుపులు వినిపించాయని రామసుబ్బయ్య చెప్పారు. పూజగదిలో ఉన్న పద్మజ వచ్చి తన పిల్లలకు ఇబ్బంది ఉన్నదని, మంత్రంతో బాగు చేయాలని చెప్పారు. పైకి వెళ్లి తలుపు తట్టగా తీయలేదు. దాంతో పట్టకారుతో గడియ తొలిగించి లోనికి వెళ్లాం. అమ్మాయిలిద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. వారికి అర్ధగంటపాటు మంత్రం వేశాను. వారి బంధువులు వెంటరాగా తాయెత్తులు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి కొన్నాం. మా ఇంటికి వెళ్లి తాయెత్తులు సిద్ధం చేసుకొని తిరిగి వెళ్లగా, ఎవరో ఓ సన్నటి వ్యక్తి అమ్మాయిల దగ్గర కూర్చొని చెవిలో శంఖం ఊదుతుండటం చూశాను. అతను ఉన్నాడు కదా అని, తిరిగి వచ్చేశానని రామసుబ్బయ్య వివరించారు.