రెడ్”డించక్ డించక్ జింక”

రామ్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజ్‌, మాళవికాశర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలో రామ్‌, హెభాపటేల్‌పై చిత్రీకరించిన ‘ఏయ్‌ డించక్‌ డించక్‌ డింక..ఆడ ఈడ దూకకే జింక..’ అనే లిరికల్‌ వీడియోను  చిత్రబృందం బుధవారం విడుదలచేసింది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని సాకేత్‌, కీర్తనా శర్మ ఆలపించారు. జానీ మాస్టర్‌ నృత్యాల్ని అందించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సినిమాలో వచ్చే తొలి గీతం ఇది. రామోజీఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఆరు రోజుల పాటు చిత్రీకరించాం. మాస్‌ ప్రేక్షకుల్ని ఈ పాట మెప్పిస్తుంది’ అని తెలిపారు. జానీ మాస్టర్‌ మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌కు ముందు ఈ పాటను చిత్రీకరించాం. ఇందులో తన స్టెప్పులతో రామ్‌ అదరగొడతాడు. హెభాపటేల్‌కు ఇదే తొలి స్పెషల్‌ సాంగ్‌. ఆమె నృత్యాలు ఆకట్టుకుంటాయి. థియేటర్‌లలో ఈ పాట ప్రేక్షకుల్ని  అలరిస్తుంది’ అని చెప్పారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ.