రైల్వే ట్రాక్‌‌పై శవాలైన ప్రేమ జంట

ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్‌‌పై శవాలై కనిపించిన ఘటన యూపీలో జరిగింది. ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని యువతీయువకులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. షాజహాన్‌పూర్‌ జిల్లాలోని జైతిపూర్ ఏరియాకి చెందిన యువకుడు(23), అదే గ్రామానికి చెందిన యువతి(19) ప్రేమించుకున్నారు. దూరపు బంధువులు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది.

ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో పెళ్లికి నిరాకరించారు. కులపెద్దలు కూడా ఇద్దరి ప్రేమను వ్యతిరేకించడంతో పాటు యువతికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో కొద్దిరోజుల కిందట ఇల్లు విడిచి పారిపోయారు. మరుసటిరోజే బరేలీ జిల్లాలోని బిల్పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా కనిపించారు. ప్రేమపెళ్లికి అంగీకరించలేదన్న మనస్థాపంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టానికి పంపించారు. అయితే గత 2019 నుంచి బరేలీ డివిజన్‌లో 22 ప్రేమ జంటలు ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. యువకుడి సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. కానీ సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఎస్పీ చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.