ప్రియుడు చనిపోయాడని ప్రియురాలి మృతి

నచ్చినవాడితో కలిసి నడవాలని ఊహల్లో తేలిపోయిందో అమ్మాయి. అతడే తన సర్వస్వమని భావించింది. కానీ అతడు 24 ఏళ్లకే ఈ జీవితమే వద్దనుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కుమిలిపోయింది. తిండీనిద్రా లేకుండా అతడినే కలవరించింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రియుడిని చేరుకునేందుకు చివరికి తను కూడా తనువు చాలించింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌కు చెందిన ఎమ్‌ సుజాత(20) కాలేజీ విద్యార్థిని. ఆమె, తన బంధువైన సిలంబర్సన్‌(24) కొన్నాళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అందుకు అమ్మాయి బంధువులు ఒప్పుకోలేదు. పెళ్లి జరిపించే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపానికి లోనైన సిలంబర్సన్‌ చిత్తూరులోని తన నివాసంలో ఫిబ్రవరి 22న ఉరేసుకుని మరణించాడు. అతడి మృతి సుజాతకు అశనిపాతంలా తాకింది.

దీంతో ఆమెను తల్లిదండ్రులు చెన్నైలోని బంధువు ఇంటికి పంపించారు. కనీసం అక్కడైనా ఆమె మనసు కుదుటపడుతుందని భావించారు. కానీ తన ప్రియుడు మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయిన యువతి అన్నపానీయాలు తీసుకోవడం మానేసింది. దీంతో ఆమె శరీరం కొద్దికొద్దిగా నీరసించిపోగా శుక్రవారం నాడు ఒంటికి నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న బంధువులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచింది. ప్రియుడు చనిపోయిన వారం రోజులకే ఆమె కూడా మరణించడం స్థానికులను కలిచివేసింది.