ఢిల్లీలో దారుణ ఘటన

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ప్రేమ పెళ్లికి నిరాకరించాడని ప్రేమించిన అమ్మాయి తండ్రిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని సోనియా విహార్‌లో శనివారం చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు ఆరెస్టు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. సూరజ్‌ కుమార్‌(25) అనే యువకుడు సోనియా విహార్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అతడు పాలం మెట్రో స్టేషన్‌లో హౌజ్‌ కీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సూరజ్‌.. విహార్‌కు చెందిన బెనర్జీ సింగ్‌ అనే వ్యక్తి కూతురితో కొన్నేళ్లుగా ప్రేమలోఉన్నాడు.

ఇదే విషయం అమ్మాయి తండ్రి బెనర్జీకి చెప్పి తమకు పెళ్లి చేయాలని సూరజ్‌ కోరాడు. అయితే వారి పెళ్లికి బెనర్జీ అంగీకరించకపోవడంతో సూరజ్‌ కక్ష్య పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సూరజ్ శనివారం బెనర్జీ ఇంటికి వెళ్లి కత్తితో బెనర్జీపై దాడి చేసి ఆపై ప్రెషర్‌ కుక్కర్‌తో తలపై పలుమార్లు బాదాడు. దీంతో బెనర్జీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీనిపై బాధితుడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే బెనర్జీ మృతి చెందాడు.

ఈ ఘటనపై డీసీపీ వేద్‌ ప్రకాష్‌ సూర్య మాట్లాడుతూ.. బాధితుడు బెనర్జీ భార్య సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే బెనర్జీ బెడ్‌పై శవమై ఉన్నాడు. దీంతో ఆమె​ ఫిర్యాదు మేరకు సూరజ్‌ను అరెస్టు చేసి విచారించగా.. బెనర్జీ దంపతులు సదరు యువతిని దత్తత తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సూరజ్‌తో‌ ప్రేమలో పడిన యువతిని ఆమె తల్లిద్రండులు పలుమార్లు హెచ్చరించినప్పటకి ఆమె వినలేదు. దీంతో వారి పెళ్లికి బెనర్జీ నిరాకరించడంతో ఆమె తన అసలైన తల్లిదండ్రులను దగ్గరకు వెళ్లిపోయిందని ఆయన అన్నారు.

సూరజ్‌ ఆ యువతి అసలైన తల్లిదండ్రులను కూడా తమ ప్రేమ విషయం చెప్పి బెనర్జీని తమ పెళ్లికి ఒప్పించాలని కోరాడని, అయినప్పటికి బెనర్జీ వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో సూరజ్‌ అతడిపై క్షక్ష్య పెంచుకున్నట్లు తెలిపారు. దీంతో బెనర్జీని చంపడానికి సూరజ్‌ ప్లాన్‌ చేసుకుని నవంబర్‌ 28 నుంచి బెనర్జీ, అతడి భార్యను వెంబడిస్తున్నట్లు సూరజ్‌ విచారణలో వెల్లడించాడని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సూరజ్‌ శనివారం బెనర్జీ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఆపై ప్రెషర్‌ కుక్కర్‌తో పలుమార్లు తలపై కొట్టినట్లు డీసీపీ పేర్కొన్నారు.