లోన్ మాఫియా డాన్ అరెస్ట్

సిటీబ్యూరో: లోన్‌ యాప్‌ల కేసులో కీలక సూత్రధారి, చైనాకు చెందిన ఝా వీ అలియాస్‌ ల్యాంబోను, అతనికి సహరించిన నాగరాజు(కర్నూలు)ను పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బుధవారం అరెస్టు చే శారు. గుర్గావ్‌లో అగ్లో, లిఫాంగ్‌, పిన్‌ ప్రింట్‌, నాబ్లూమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాప్‌ల నిర్వాహకుడు ల్యాంబోనే అని దర్యాప్తులో తేలింది. బాధితుల ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. 391 రుణ యాప్‌ల ద్వారా రోజూ రూ.20 కోట్ల లావాదేవీలే లక్ష్యంగా చైనా మాఫియా పనిచేస్తున్నది.

చైనా మాఫియా విస్తరించిందిలా..

చైనాకు చెందిన యూన్‌ యూన్‌ అలియాస్‌ జెన్నిఫర్‌ అనే మహిళ భారత్‌కు వచ్చి ఢిల్లీలో మకాం వేసి కంపెనీలు, కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కష్టతరంగా మారటంతో చైనాలో ఉన్న తమ భాగస్వాములలో ఒకరైన ఝా వీ అలియాస్‌ ల్యాంబోను జనవరిలో భారత్‌కు రప్పించింది. రెండునెలల్లో ల్యాంబోకు జెన్నిఫర్‌ అన్ని విషయాలను చెప్పింది. ఆ సమయంలో కర్నూలుకు చెందిన నాగరాజు వాళ్లతో చేతులు కలిపాడు. కంపెనీల రిజిస్ట్రేషన్‌, డైరెక్టర్లుగా స్థానికులను చేర్పించడం, బ్యాంకుల్లో కరెంటు ఖా తాలు తెరువడం తదితర పనులను నాగరాజు చేశాడు. ఇలా నాగరాజు పేరుమీదనే 10 ఖాతాలు తెరిచారు. ఫిబ్రవరి కల్లా ల్యాంబోకు పట్టు రావడంతో జెన్నిఫర్‌ చైనా వెళ్లిపోయింది.

3,200 మందితో టెలీకాలర్‌ వ్యవస్థ

వీళ్లంతా ఐదు కంపెనీల పేర్లతో ఒక్కో కంపెనీకి అనుబంధంగా 50 యాప్‌లను తయారు చేయించారు. గుర్గావ్‌లో 2 వేల మందితో ఐదు కాల్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. నాగరాజుతో కలిసి వచ్చి హైదరాబాద్‌లో మూడు, బెంగళూర్‌లో రెండు కేంద్రాలను ల్యాంబో ఏర్పాటు చేయించా డు. ఇలా ల్యాంబో నేతృత్వంలో 3,200 మంది టెలీకాలర్స్‌తో వసూళ్ల వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. ల్యాంబో గుర్గావ్‌లోని స్టార్‌ హోటల్‌లో ఉంటూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వ్యాపారాన్ని విస్తరించాడు.