సజీవ దహనమైన చిన్నారి

ముద్దుముద్దు మాటలతో సందడి చేసే మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ సజీవ దహనమైన విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోనే ఉన్న చిన్నారి మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన క్రోసూరు మండలం బయ్యవరంలో జరిగింది. గ్రామానికి చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు.

వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటూ చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టాడు. హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.